Breaking News >> News >> Namasthe Telangana


ఆన్‌లైన్‌లో కొన్నా పూర్తి రక్షణ


Link [2022-03-16 02:15:28]



వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందండి నాణ్యమైన వస్తువులు, సేవలను పొందే హక్కు ఉంది మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ 2019 వినియోగదారుల చట్టంతో అనేక ప్రయోజనాలు డిస్ట్రిక్ట్‌ కన్స్యూమర్‌ డిస్ప్యూట్‌ రీడ్రెస్సల్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ కస్తూరి మెదక్‌, మార్చి 15: నేటి ఆధునిక డిజిటల్‌ యుగంలో కూడా వినియోగదారులు అనేక రూపాల్లో మోసపోతున్నారని, ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు విద్యావంతులు, యువత కూడా మోసపోతున్నారని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాలశాఖ మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మనం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాణ్యమైన వస్తువులను, సేవలను పొందే హక్కు ఉందని, ఒక వేళ వినియోగదారుడు మోసపోయినట్టు భావిస్తే జిల్లా వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించి న్యాయం పొందాలని సూచించారు. వారికి రక్షణగా ప్రభుత్వం పాత వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986ను సవరించి మరింత రక్షణ కల్పించే విధంగా కొత్తగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019ను రూపొందించిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా వినియోగదారుడికి నష్టం జరిగినట్లు లేదా మోసపోయినట్లు భావించిన ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులను జవాబుదారులను చేస్తూ నష్టపరిహారం, జరిమానాతో పాటు జైలుకు పంపడానికి అవకాశం కల్పిస్తున్నదన్నారు. వినియోగదారుడు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌, మల్టీలెవల్‌ మార్కెటింగ్‌, ఈ-కామర్స్‌ తదితర విధానాల ద్వారా వస్తువులు కొనుగోలుచేసి మోసపోయినట్లు భావిస్తే ఈ చట్టం రక్షణగా నిలుస్తుందన్నారు.

వస్తువు నాణ్యత లోపాలున్నప్పుడు వారంటీతో సంబంధం లేకుండా నష్టపరిహారం పొందవచ్చని, వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినా సరే ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చని, సేవా రంగంలో లోపాలున్నా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ చట్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ గ్రామాల్లో, ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగంతో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరిగి మోసపోతున్నారని వాటిపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఈ సంవత్సరం వినియోగదారుల పరిరక్షణ దినోత్సవాన్ని న్యాయమైన డిజిటల్‌ ఫైనాన్స్‌ అంశంతో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌రావు, జిల్లా వినియోగదారుల సంఘం కన్వీనర్‌ వెంకటేశం, సభ్యులు, రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ముద్రించిన గోడ పత్రికను అదనపు కలెక్టర్‌ రమేశ్‌ ఆవిష్కరించి అనంతరం కేక్‌కట్‌ చేశారు.

2019 వినియోగదారుల చట్టంతో అనేక ప్రయోజనాలు సంగారెడ్డి కలెక్టరేట్‌, మార్చి 15: వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పూర్తి రక్షణ పొందవచ్చని డిస్ట్రిక్ట్‌ కన్స్యూమర్‌ డిస్ప్యూట్‌ రీడ్రెస్సల్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ కస్తూరి పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తారా ప్రభుత్వ అటానమస్‌ కళాశాల కామర్స్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ 2019లో తీసుకొచ్చిన నూతన వినియోగదారుల చట్టంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. వినియోగదారులకు ఈ నూతన చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులకు సైతం రక్షణ పొందవచ్చన్నారు.

అయితే వినియోగదారులు తాము కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన రసీదును విధిగా తీసుకోవాలని సూచించా రు. కమిషన్‌ సభ్యులు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ వినియోగదారుల దినోత్స వ లక్ష్యం డిజిటల్‌ మార్కెట్‌లో మరింత పారదర్శకత సాధించేందుకు నిర్ణయించారని తెలిపారు. వినియోగదారులకు ఉన్న విశిష్ట హక్కులను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రవీణ, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ వెంకటేశం, డాక్టర్‌ ఉపేందర్‌, కామర్స్‌ విభాగధిపతి సంతోషి, అకాడమిక్‌ కో-ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్‌ ఏవీ శర్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Most Read

2024-09-08 06:02:10